పల్లె నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్‌కు వెళ్లే దారులన్నీ రద్దీ

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి భాగ్యనగరం బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు స్తంభించాయి. మొత్తం 16 టోల్‌బూత్‌లకు గానూ హైదరాబాద్ వైపు 9 తెరిచారు. అందులో 8 ఫాస్టాగ్, ఒకటి నగదు చెల్లింపునకు కేటాయించారు. అన్నింటిలోనూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది.
సోమవారం నుంచి ఆఫీసులు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో అందరూ ఆదివారం సాయంత్రం పిండివంటలను క్యాన్లు, బ్యాగులకు సర్దుకుని రోడ్డెక్కారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే వైపునకు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలావరకు వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ రద్దీ అధికంగానే ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఇదే తరహా రద్దీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి. బస్సుల్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. కార్లు, బస్సులు టోల్‌ప్లాజాల వద్ద బారులు తీరాయి. నార్కట్‌పల్లి-అద్దంకి హైవే.. మాడుగులపల్లి టోల్ ప్లాజా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు వరంగల్ - హైదరాబాద్ హైవేపై.. గూడూరు టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com