చదువుల తల్లికి పేదరికం అడ్డురాలేదు.. తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా..

బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి. అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. ఓ కొడుకు కంటే ఎక్కువగా ఆలోచించింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలతకు చిన్నప్పటినుంచి చదువంటే ఎంతో ఆసక్తి. అమ్మానాన్న కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు.
వారు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసింది. పేదరికం నుంచి గట్టెక్కాలంటే చదువొక్కటే మార్గమని తలచింది. బొల్లబోయిన కుమార స్వామి, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారస్వామి గ్రామంలో హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసింది.
ప్రైవేటుగా డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పూర్తి చేసింది. అనంతరం గ్రూప్ 1 పరీక్షకు సిద్దమైంది. ఈ క్రమంలో చెల్లికి పెళ్లైంది. తాను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు పెళ్లి చేసుకోవద్దనుకుంది. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్ఐకు ఎంపికయ్యింది. ఆమె కష్టానికి ఫలితం దక్కిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com