TS: ప్రజా పాలనకు అనూహ్య స్పందన

TS: ప్రజా పాలనకు అనూహ్య స్పందన
జోరుగా అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ.... బారులు తీరి దరఖాస్తులు సమర్పించిన ప్రజలు...

తెలంగాణలో రెండురోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. ఆరు గ్యారంటీ పథకాల కోసం అర్జీ పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరటంతో ప్రజాపాలన కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్‌లోని అంజయ్యనగర్, పాపిరెడ్డికాలనీ, మజీద్‌బండలో ప్రజాపాలన కౌంటర్లను G.H.M.C కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ సందర్శించారు. నాంపల్లిలోని విజయ్‌నగర్‌ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. మూడురోజుల్లో GHMC పరిధిలో ఆరు గ్యారంటీల పథకాల కోసం 8న్నర లక్షలకు పైగా అర్జీలు వచ్చాయన్న మంత్రి అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తులు చేసుకోవచ్చాని సూచించారు.


సూర్యాపేట జిల్లాలోనూ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు భారీగా దరఖాస్తులు సమర్పించారు. నడిగూడెం మండలంలో జరిగిన గ్రామసభను ఆర్డీవో పరిశీలించారు. నడిగూడెం తహసీల్దార్‌ హేమమాలిని, ఎండీవో ఇమామ్‌, ఆర్‌ఐ, వ్యవసాయ అధికారితో పలువురు అధికారులు పాల్గొన్నారు. హేమమాలిని మాట్లాడుతూ ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని... అందరి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని వరంగల్‌ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్‌, జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా....ఇప్పటివరకు నాలుగు లక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గతసర్కారు ఆరున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి... చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఆరోపించారు.


నారాయణఖేడ్‌లోని హనుమంత్‌రావు పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజా నరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి, ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడమే ప్రజా పాలన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని.... చెన్నూరు MLAవివేక్ వెంకటస్వామి ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిర్మల్ జిల్లా పొంకల్‌ గ్రామంలో నిర్వహించిన అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభయహస్తం దరఖాస్తులు చేసుకునేందుకు... ప్రజలు పెద్ద ఎత్తున వరుస కట్టారు. పెద్దపల్లి జిల్లాలోని పలు వార్డుల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో... కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. అర్జీదారులకు ఏలాంటి సందేహాలు వచ్చిన నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా అర్బన్‌ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా పరిశీలించారు. రసీదులను పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని దరఖాస్తు దారులకు సూచించారు.

Tags

Next Story