Telangana State election: అల్లర్లు జరగకుండా ఐదంచెల భద్రత

Telangana State election:  అల్లర్లు జరగకుండా ఐదంచెల భద్రత
తెలంగాణ లో పోలింగ్​కు సర్వం సిద్ధం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించిన పోలీసు ఉన్నతాధికారులు...గురువారం జరిగే పోలింగ్‌ను శాంతియుత వాతావారణంలో నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఈవీఎంలు తరలించే దగ్గరి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ను విధించారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడొద్దని హెచ్చరించారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు 48 గంటలపాటు మూసివేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోసం విధుల్లో భారీగా సిబ్బందిని మోహరించారు . 45వేల రాష్ట్ర పోలీసులు..3వేలు ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు . వీళ్లకు అదనంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి 23 వేల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు .


సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పహారా ఉంచనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను మోహరించనున్నారు . గస్తీ వాహనాలు సైతం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి . పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈవీఎంల తరలింపు సైతం పకడ్బందీగా చేయనున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లే వాహనాలకు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద కేంద్ర రక్షణ బలగాలు 24గంటల పాటు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాలతోపాటు మూడంచెల భద్రత కల్పించారు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ఎదుట మహిళలు ఒక వరుస, పురుషులు మరో వరుసలో నిలబడాలని... అంతకంటే ఎక్కువ వరుసలు ఉండొద్దని పోలీసు అధికారులు స్పష్టంచేశారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్న పోలీసులు..ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story