Hyderabad : బంజారాహిల్స్ పబ్ కేసు.. హోటల్ బార్ లైసెన్స్ రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

Hyderabad : బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది.. కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.. అటు తాజా ఉదంతంతో రాడిసన్ హోటల్ లైసెన్సును ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. 24 గంటలపాటు లిక్కర్ సప్లయ్‌కి జనవరి 7న.. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి పొందింది. దీని కోసం 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించింది యాజమాన్యం. అయితే, పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంతో పబ్‌తోపాటు లిక్కర్ లైసెన్సులను రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించినట్లు తేలడంతో లైసెన్సు రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
మరోవైపు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పార్టీకి హాజరైన లిస్టులో మార్పులు, చేర్పులు చేశారు. లిస్టులో 38వ నెంబర్‌గా మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె పేరును పోలీసులు చేర్చారు. పబ్‌లో 145 మంది వివరాలు సేకరించినట్లుగా తెలిపిన పోలీసులు.. అందులో 125 మంది వీఐపీలు, సెలబ్రిటీలకు సంబంధించినవారు ఉన్నారని గుర్తించారు. 20 మంది పబ్ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.
అటు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.. ఈ కేసులో అనిల్, అభిషేక్‌తోపాటు మరో ఇద్దరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు పోలీసులు.. A1గా పబ్ మేనేజర్ అనిల్ పేరు చేర్చగా.. A2గా అభిషేక్ ఉప్పల ఉంటే, A3గా అర్జున్ వీరమాచినేనిని చేర్చారు.. ఈ కేసులో తెరపైకి పబ్ మాజీ పార్ట్‌నర్ కిరణ్ రాజ్ పేరు కూడా వచ్చింది. A4 గా ఉన్న కిరణ్ రాజ్ రేణుకా చౌదరి కూతురు తేజస్విని భర్త. ప్రస్తుతం కిరణ్ రాజ్ పరారీలో ఉన్నాడు. ఇక అనిల్, అభిషేక్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.. కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.. దీంతో అనిల్, అభిషేక్ ఉప్పలను రిమాండ్‌కి తరలించారు. పరారీలో ఉన్న కిరణ్ రాజ్, అర్జున్ మాచినేని కోసం గాలింపు వేగవంతం చేశారు.
మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.. రాడిసన్ హోటల్‌లోని పబ్ రైడ్‌లో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే ఉన్నారంటూ TRS ఎమ్మెల్యే బాల్క సుమన్ బాంబ్ పేల్చారు. దొరికిన వాళ్లంతా బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు... వారి పిల్లలే అని ఆరోపించారు బాల్క సుమన్. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇపుడు ఎవరికి నీతులు చెబుతారో చూడాలని ఎద్దేవా చేశారు.అయితే, బాల్క సుమన్ ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తిప్పికొట్టారు.. అందులో మొత్తం టీఆర్‌ఎస్ వాళ్లే ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు.. అలా అనుకున్నప్పుడు అందరికీ టెస్టులు చేయకుండా ఎందుకు వదిలేశారో చెప్పాలంటూ సూటిగానే నిలదీశారు.. అసలు డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయో మూలాలు వెతక్కుండా ఈ ఆరోపణలేంటంటూ రాజాసింగ్ ఫైరయ్యారు.
మొత్తానికి రాడిసన్ హోటల్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ వ్యవహరంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com