PV Birth Anniversary: పీవీ 102వ జయంతి.. రాష్ట్ర నేతల నివాళులు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించారు. దేశానికి, తెలంగాణకు పీవీ నరసింహారావు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చా యని చెప్పారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో దేశ ఔన్నత్యాన్ని కాపాడారని తెలిపారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్థిక సంస్కరణల జాతిపిత పీవీ నరసింహారావు అంటూ ప్రశంసించారు. దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు అన్నారు. పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఆనాడే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పీవీ నరసింహారావు పోరాడారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన బహుభాషా కోవిదుడని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన బిడ్డ పీవీ అని ఈటల కొనియాడారు. గాంధీ భవన్‌లో పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com