Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు రాహుల్‌ దిశానిర్దేశం..

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు రాహుల్‌ దిశానిర్దేశం..
Congress: తెలంగాణ పార్టీని బలోపేతం చేసే దిశగా.. కాంగ్రెస్‌ హై కమాండ్‌ కార్యాచరణ రూపొందించింది.

Congress: తెలంగాణ పార్టీని బలోపేతం చేసే దిశగా.. కాంగ్రెస్‌ హై కమాండ్‌ కార్యాచరణ రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి AICCకి నివేదిక ఇవ్వగా.. ఆ నివేదికపై పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో ఆరా తీసింది. రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సర్వేచేసి చేశారు.

తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించిన సునీల్‌ బృందం నియోజక వర్గాల వారీగా, పార్టీల వారీగా బలాబలాలను అంచనా వేసింది. ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, అటు రాజకీయ వ్యూహకర్త సునీల్‌లు ఇచ్చిన నివేదికలు దాదాపుగా ఒకటిగా ఉండడంతో.. రేవంత్‌ రెడ్డిపై ఏఐసీసీకి మరింత విశ్వాసం పెరిగినట్లయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాతనే రాహుల్‌ గాంధీ రాష్ట్ర పార్టీ నాయకులను ఢిల్లీకి పిలిచి మాట్లాడినట్లు చెబుతున్నారు.

రాహుల్‌ సమావేశంలో తెలంగాణలో పార్టీ స్థితిగతులపైనే ఎక్కువ అడిగి తెలుసుకున్నారు. ఇక తాజా రాజకీయ పార్టీల బలాబలాలపై అందిన రెండు నివేదికలను క్రోడీకరించి అమలు చేయాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ రోజు రోజుకు బలం పుంజుకుంటున్నట్లు చెబుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలల్లో బలమైన శక్తిగా ఎదిగామని కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రధానంగా వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో కొంతభాగం కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరిగిందని, ఉత్తరతెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు పోటాపోటీగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త సునీల్‌ ఏఐసీసీ అధిష్ఠానం సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న డీసీసీలల్లో దాదాపు సగం మందిని పక్కన పెట్టి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సూచించారు. ఆ మేరకు పీసీసీ కసరత్తు చేస్తోంది.

డీసీసీలను తొలిగించినప్పటికీ వారిలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు.. కొందరికి రాష్ట్రస్థాయి పదవులను ఇవ్వాలని పీసీసీ యోచిస్తోంది. మరోవైపు సీనియర్లకు ఏదోఒక పదవి ఇస్తే.. విభేదాలు రావని భావిస్తోంది. నియోజక వర్గాల వారీగా గెలుపు గుర్రాలు ఎంత మంది ఉన్నారన్న కోణంలో కూడా సునీల్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు ఇచ్చిన నివేదికల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయర వర్గాల సమాచారం మేరకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 50 స్థానాల్లో గెలిచి సత్తా ఉన్న అభ్యర్ధులు ఉన్నట్లు మిగిలిన స్థానాల్లో అధికార పార్టీని ఎదర్కొనే సత్తా కలిగిన వారిని ఎంపిక చేయాల్సి ఉందని సమాచారం. అయితే డీసీసీల మార్పు దగ్గర నుంచి నియోజక వర్గాల్లో బలమైన నాయకత్వాలను తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ పర్యటన తరువాత కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story