Rahul: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

దేశంలో కుల వ్యవస్థ ఉందన్నది కాదనలేని వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణలో కులగణన సర్వే సదస్సులో పాల్గొన్న రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనలో దేశానికి తెలంగాణనే రోల్ మోడల్ అని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని వెల్లడించారు. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించిన కులగణన సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. ఆత్మ విశ్వాసాన్ని కుల వ్యవస్థ దెబ్బ తీస్తుందన్న రాహుల్.. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. . మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖిగా మాట్లాడారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.
కుల గణనను అందుకే వ్యతిరేకిస్తున్నారు
దేశ సంపద సమానంగా పంచాలంటే కుల గణన అవసరమని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియాలన్నారు. దేశం సమగ్రంగా ఎదగాలంటే.. కుల వ్యవస్థను నిర్మూలించాలన్నారు. రాజకీయ, న్యాయ వ్యవస్థల్లోనూ కుల వ్యవస్థ ఉందన్న రాహుల్.. ప్రధాని మోదీ ఇప్పటివరకూ కుల వ్యవస్థపై మాట్లాడలేదన్నారు. వాస్తవాలు బయటకు రావొద్దనే కులగణనను వ్యతిరేకిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశంలో కుల వ్యవస్థ బలంగా ఉందన్నారు.
ఎక్కడా లేదని ఇక్కడే..
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కులవ్యవస్థ ఇండియాలోనే ఉందని రాహుల్ మండిపడ్డారు. కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని చెప్పారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు.
బాధ్యతగా భావిస్తాం
తెలంగాణలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సామాన్య ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమన్నారు. కులగణన మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని సీఎం రేవంత్ కామెంట్ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com