Rahul Gandhi: మే మొదటి వారంలో తెలంగాణకు రాహుల్.. ముఖ్య నేతలంతా స్పెషల్ ఫోకస్..

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీ కాంగ్ నేతలు.. మే నెల మొదటి వారంలో రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ.. రెండు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. మే 6న వరంగల్ టౌన్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ గాంధీతో నిర్వహిస్తున్న ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపెలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు.. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్ ఖాయమని చెబుతున్నారు టీ.కాంగ్రెస్ నేతలు. అటు ఇప్పట్నుంచే రాహుల్ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు టీ కాంగ్ ముఖ్య నేతలు.. బహిరంగ సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో ఉన్న కాంగ్రెస్.. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలంతా ఈ పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. రాహుల్ సభ విజయవంతానికి క్షేత్ర స్థాయిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఆయనతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభా స్థలి పరిశీలనతో పాటు జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మరోవైపు పార్టీ ముఖ్యనేతలు మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేటలో పర్యటించి నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో జిల్లా నాయకులతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇక 23న మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది..
దీంతోపాటు టీపీసీసీ, పీఏసీ, డీసీసీ, అనుబంధ సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు జరపనున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ముఖ్యనేతలు అందరూ ఉమ్మడి మది జిల్లాల వారీగా.. దీంతో పాటు అసెంబ్లీ, లోక్ సభ నాయకులు వారి వారి నియోజకవర్గాల వారీగా రాహుల్ సభ కోసం సన్నాహక సమావేశాలు జరిపేలా పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అందుకు అనుగుణంగానే పార్టీ నేతలంతా పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో రైతులు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. వరంగల్‌లో రాహుల్ బహిరంగ సభకు భారీగా హాజరవుతారని చెబుతున్నారు. అందుకే బహిరంగ సభకు ముందు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా రాహుల్ రెండు రోజుల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపేలా ఇప్పటి నుంచే జిల్లాల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు జరుపుతూ.. జనంలోకి రాహుల్ పర్యటన అంశాన్ని విస్తృతంగా తీసుకెళుతున్నారు టీ.కాంగ్రెస్ నేతలు. వరంగల్‌లో కాంగ్రెస్ సభ రాహుల్ సభకు ముందు తర్వాత అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని హస్తం నేతలు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com