Rahul Gandhi: ముగిసిన రాహుల్ గాంధీ తెలంగాణ టూర్.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రెండ్రోజుల తెలంగాణ టూర్ ముగిసింది. చివరి రోజు బిజీబీజీగా గడిపారు రాహుల్. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రాహుల్ వచ్చే ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు. ఐక్యంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. కేసీఆర్ దగ్గర జన బలం లేదన్న రాహుల్.. ఎవరితోనూ పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
జనాల్లో ఉన్నోళ్లకే టికెట్లిస్తామని మరోసారి తేల్చి చెప్పారు రాహుల్. లీడర్లంతా హైదరాబాద్ వీడి, ఊళ్ల బాట పట్టాలన్నారు. ఢిల్లీ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీడియాతో ఏది పడితే అది మాట్లాడొద్దంటూ అల్టిమేటమ్ ఇచ్చారు రాహుల్. అంతకు ముందు ఉద్యమకారులతో పాటు ప్రముఖులతో సమావేశమయ్యారు.
రాహుల్‌ను కలిసినవారిలో గద్దర్, కంచె ఐలయ్య, గాదె ఇన్నయ్య సహా పలువురు ఓయూ, కేయూ ప్రొఫెసర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌తో కలిసి రావాలని ఉద్యమకారులను కోరారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దివంగత సీఎం దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పించారు. ఆయన మరణించి 50 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని అంజలి ఘటించారు. సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు.
సంజీవయ్యకు నివాళులు అర్పించిన అనంతరం.. నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఓయూలో వీసీ ఛాంబర్ ముందు నిరసన తెలిపి అరెస్టైన 18 మంది NSUI నేతలను పరామర్శించారు. గాంధీభవన్‌లో భేటీ అనంతరం.. నేరుగా లుంబినీ పార్క్‌కు వెళ్లి.. అమరవీరుల స్మృతివనం పనుల్ని పరిశీలించారు. 8 ఏళ్లైనా పూర్తి చేయలేదని.. రాహుల్‌కు వివరించారు పీసీసీ చీఫ్ రేవంత్. అనంతరం.. లుంబినీపార్క్ నుంచి నేరుగా శంషాబాద్‌కు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com