RAHUL: ప్రధాని పదవి చేపట్టేందుకు నేను సిద్ధం

తెలంగాణ రాజకీయ వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం ముగింపు సభలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయంగా, భావప్రకటన పరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా తాను ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం, అలాగే కాంగ్రెస్–బీజేపీ విధానాలపై రూపకాల ద్వారా వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది. అనంతగిరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. సభలో ముందుగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబానికి దేశ రాజకీయాల్లో ఉన్న చరిత్రను ప్రస్తావిస్తూ, ఆయన ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ ప్రధానులుగా సేవలందించారని గుర్తుచేశారు. అందువల్ల రాహుల్‌కు ప్రధాని పదవిపై వ్యక్తిగత వ్యామోహం ఉండదని రేవంత్ పేర్కొన్నారు.
రాహుల్ అవసరం ఉంది
అయితే ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా అడగడం లేదని, ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా కోరుకుంటున్నానని తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన ప్రధాని బాధ్యతలు స్వీకరించాలని, అందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ, ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధానాలపై పోరాడేందుకు తాను సిద్ధమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మరో ఆసక్తికర అంశం రాహుల్ గాంధీ చేసిన రూపకాల వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీని శివుడితో, బీజేపీని విష్ణువుతో పోల్చుతూ ఆయన రాజకీయ విధానాల మధ్య తేడాను వివరించారు. కాంగ్రెస్ విధానం అహింస, ప్రజాసేవ, సిద్ధాంతాలపై ఆధారపడినదని చెప్పారు. శివుడిలా నిరాడంబరంగా, సమతుల్యంగా వ్యవహరించాలనే సందేశం పార్టీ నేతలకు ఇచ్చారు. శివుడు తనలో సగభాగాన్ని మహిళకు ఇచ్చి సమానత్వానికి ప్రతీకగా నిలుస్తాడని, ఆయన వద్ద త్రిశూలం ఉన్నా అది వెనుకే ఉంటుందని—ధర్మ రక్షణ అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తారని వివరించారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా అవసరమైతేనే కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ, ఆ పార్టీ విధానం ఆడంబరంగా, అధికార కేంద్రీకృతంగా ఉందని విమర్శించారు. హింస, అధికార ఆశతో ప్రజలను మోసం చేసే విధానమే బీజేపీ అనుసరిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఈ పోలికలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
కీలక ఆదేశాలు
రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు పార్టీ భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు. “డీసీసీ అధ్యక్షులు అంటే మా టీమ్” అని చెప్పిన ఆయన, భవిష్యత్ కాంగ్రెస్ నిర్మాణంలో వారి పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. పార్టీ నేతలు నిజాయితీ, సింప్లిసిటీ, దృఢత్వంతో పని చేయాలని సూచించారు. ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకుని, సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు. పది రోజుల పాటు సాగిన ఈ శిక్షణా శిబిరం ద్వారా పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేయాలన్నదే లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వ ధోరణి, ప్రజలతో అనుసంధానం, సిద్ధాంతపరమైన అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం పార్టీకి ఉత్సాహాన్నిచ్చేలా ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్–బీజేపీ పోలికలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. మతపరమైన రూపకాల ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయన వ్యాఖ్యలను తాత్విక దృష్టికోణంగా సమర్థిస్తున్నాయి. అనంతగిరిలో జరిగిన ఈ సభ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రధానమంత్రి పదవిపై తన సిద్ధతను ప్రకటించడం ద్వారా రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో తన పాత్రను స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ విధానం, నాయకత్వ ధోరణిపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాబోయే రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
