RAHVEER: ప్రాణ రక్షకులకు ప్రత్యేక ప్రోత్సహకాలు

రోడ్డుపై ఎవరో రక్తపు మడుగులో పడివుంటే… గుండె కదిలినా కాళ్లు ముందుకు రాకపోయిన రోజులు చాలానే ఉన్నాయి. “సాయం చేస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది”, “కోర్టులకెక్కాల్సి వస్తుంది”, “అనవసర చిక్కుల్లో పడతాం” అనే భయాలు మానవత్వాన్ని కట్టేసిన సందర్భాలెన్నో. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగస్తులు, కుటుంబ బాధ్యతలున్న వారు ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు రాకుండా వెనకడుగు వేసేవారు. ఈ ఆలస్యమే అనేక సందర్భాల్లో ప్రాణాంతకమైంది. ప్రమాదం జరిగిన తొలి గంట—‘గోల్డెన్ అవర్’—లో వైద్యం అందక ఎన్నో అమూల్యమైన ప్రాణాలు కోల్పోయాం. ఈ మౌనానికి, భయానికి, నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవత్వాన్ని బహుమతిగా మార్చే దిశగా అడుగు వేసింది.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర రవాణా శాఖ ‘రహవీర్ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత” అనే స్పష్టమైన సందేశంతో ఈ పథకం ముందుకు సాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా ముందుకొచ్చి బాధితుడిని ఆసుపత్రికి చేర్చిన సాధారణ పౌరుడిని ‘రహవీర్’గా గుర్తించి, ప్రభుత్వం గౌరవించడమే ఈ పథకంలోని మూల ఆలోచన.
భయానికి ముగింపు
ఇప్పటివరకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు సహాయం చేయాలనుకున్నవారిని వెనక్కి నెట్టింది భయమే. పోలీస్ విచారణలు, అనవసర ప్రశ్నలు, కోర్టు ప్రక్రియలు, సాక్ష్యాల పేరుతో ఎదురయ్యే మానసిక ఒత్తిడి చాలామందిని వెనక్కి నెట్టింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ‘రహవీర్’ పథకం రూపుదిద్దుకుంది. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా ప్రోత్సహించడం, సాధారణ పౌరులు భయపడకుండా ముందుకొచ్చే వాతావరణాన్ని సృష్టించడం, సహాయం చేసిన వారికి పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించడం—ఇవే ఈ పథకంలోని ప్రధాన లక్ష్యాలు. ఈ పథకం కింద ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడిన ప్రతి పౌరుడికి ప్రభుత్వం రూ.25,000 నగదు బహుమతితో పాటు అధికారిక ప్రశంసాపత్రాన్ని అందజేస్తుంది. ఇది కేవలం ఆర్థిక ప్రోత్సాహం మాత్రమే కాదు… సమాజంలో మానవత్వానికి ఇచ్చే గౌరవంగా అధికారులు చెబుతున్నారు.
గత అనుభవాలే మార్పునకు దారి
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గాలంటే, అధికార యంత్రాంగం మాత్రమే సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదం జరిగిన తొలి క్షణాల్లో అక్కడ ఉన్న సాధారణ పౌరుడే కీలకం. అతడో ఆమెో ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రాణం నిలుస్తుంది. కానీ భయాల వల్ల ఆ అడుగు పడటం లేదు. ఈ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం, “సాయం చేసినవారిని వేధించకూడదు” అనే స్పష్టమైన నిబంధనలతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం, ప్రమాద బాధితుడికి సహాయం చేసిన వ్యక్తిని పోలీసు విచారణలు లేదా కోర్టు ప్రక్రియల పేరుతో ఇబ్బంది పెట్టరాదని ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అదే స్ఫూర్తితో ‘రహవీర్’ పథకం ఈ చట్టపరమైన రక్షణను మరింత బలపరుస్తోంది.
ఎంపిక ఎలా జరుగుతుంది?
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి సహాయం చేసి, ఆసుపత్రికి తరలించిన వ్యక్తి వివరాలను సంబంధిత పోలీసు అధికారి (ఎస్హెచ్ఓ) లేదా ఆసుపత్రి సిబ్బంది అధికారికంగా నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత పోలీసు అధికారి జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేస్తారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. జిల్లా రవాణా శాఖ అధికారి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కమిటీ పరిశీలన అనంతరం అర్హులైన వ్యక్తులను ‘రహవీర్’గా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి వివరాలను జిల్లా కమిటీ రవాణా కమిషనర్‌కు పంపిస్తుంది. అన్ని అంచనాలు పూర్తైన తర్వాత నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అధికారికంగా అందజేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
