తెలంగాణను భయపెడుతోన్న మరో హెచ్చరిక

భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణను మరో హెచ్చరిక భయపెడుతోంది. మరో రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పడిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో వరద పరిస్థితిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి లేక రాశారు. తక్షణమే సాయం చేయాలనికోరారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయగా.. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అభిప్రాయపడ్డారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్ల సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇటు సంగారెడ్డి పట్టణంలో నీట మునిగిన ప్రాంతాలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని నాల్సాబ్ గడ్డ, మఖ్దూమ్ నగర్, నారాయణరెడ్డి కాలనీల్లో పర్యటించిన మంత్రి వరద బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగించాలని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని హరీష్ రావు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులపై వాన కత్తులు రువ్విందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శ్రీ రాముల పల్లెలో ఈదురుగాలులతో నేలమట్టమైన ఇళ్లను ఆయన పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధలా ఆదుకుంటామన్నారు.
నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలోని మూసి వాగుపై ఉన్న వంతెనపై మోత్కూర్ -నార్కెట్ పల్లి రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాధరి కిషోర్, చిరుమర్తి లింగయ్య జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి క్షత్రస్థాయిలో పరిశీలించారు.
మదిరలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మీనవోలు గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన రైతులకు ధైర్యం చెప్పారు.ఎర్రుపాలెం మండలం, రామన్న పాలెం గ్రామంలో అకాల వర్షానికి నీట మునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్‌లోని లకారం చెరువు గత 15 ఏళ్ల తరువాత నిండడం ఇదే తొలిసారి. దీంతో చెరువు అలుగుకి కొబ్బరికా కొట్టి పూజలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు 65వ జాతీయ రహదారిపైకి పూర్తిగా నీళ్లు రావడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు.
అకాల వర్షాలు భారీ పంట నష్టాన్ని, ఆస్తుల నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 54 లక్షల ఎకరాలు వరదనీటిలో మునిగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు వాగులు పొంగిపొర్లడం వల్ల కూడా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగునీటి కాల్వలకు సైతం గండ్లుపడి కడగండ్లు మిగిల్చాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంటలపై రెండు ఫీట్ల మేర ఇసుక మేటలు వేసింది.
పాలకీడు మండలం శూన్యపహాడ్ గ్రామ శివారులో ఉన్న మూసీనది ఉధృంతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతల నుండి భారీ వరద నీరు రావడంతో మూసీ ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తేశారు. ఈ వరద ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.
మంజీరా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు సింగూరు గేట్లు ఎత్తివేయడంతో.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మొన్నటి వరకు ఆశించిన నీరు లేక వెలవెలబోయిన జలాశయం ఇప్పుడు నిండు కుండగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com