CROP LOSS: అకాల వర్షం-అపార నష్టం
తెలంగాణలో అకాల వర్షాలకు ఈదురు గాలులతో కూడిన వానలకు పొలంలో చేతికొచ్చే దశలో ఉన్న వరిపైరు నేలవాలింది. కొనుగోళ్లు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టం వరద పాలైందని.. అన్నదాత ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ పలు ప్రాంతాల్లో రోడెక్కి నిరసన తెలిపారు.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండువేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని... తేమ పేరుతో నిర్వహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం కనికరించి... కొనుగోళ్లు తొందరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు..
పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ధాన్యం నీళ్లలో తడిసిపోయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ.. లాభం లేకుండాపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు, కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం వెంటనే కొనాలనే డిమాండ్‌తో.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాకపోకలకు గంటలపాటు అంతరాయం కలిగింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ .. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల రోజులవుతున్నా వడ్లు కొనే నాథుడేలేడని ఆవేదన వ్యక్తంచేశారు. రాస్తారోకోతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. పాపన్నపేట మండలం మిన్పూరులోనూ రైతులు ధర్నా చేశారు. వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని DBF జాతీయ కార్యదర్శి శంకర్ కోరారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి IKP కేంద్రంలో తడిసిన వడ్లు చూసి ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌లో రైతులు రోడ్డు ఎక్కారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం.. అన్నదాతల్ని ఆగమాగం చేసింది. భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచలోని కల్లాల్లో నీరుచేరి.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యంతో.. వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో DCMS ఛైర్మన్ ఇంద్రాసేనారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు తెచ్చి 25 రోజులు అవుతున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు అధైర్యపడొద్దని కామారెడ్డి భాజపా MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి భరోసానిచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల అధికారులతో సమావేశం పెట్టలేకపోతున్నామన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఈసీకి కూడా లేఖ రాసి.. సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com