Raja Singh Bail : రాజా సింగ్‌కు బెయిల్ వస్తుందా..?

Raja Singh Bail : గతంలో నమోదైన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ వస్తుందా...? రాదా అనేది ఉత్కంఠ కల్గిస్తోంది. పోలీసులు ఆయనను అరెస్టుచేసి పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లిజైలుకు తరలించగా.. ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశంఉంది. ఈ నేపథ్యంలో ఆయన కు బెయిల్ లభించే ఛాన్స్ ఉందా... లేక జైలులోనే గడుపాల్సి ఉంటుందా అనేది చర్చనీయాంశమైంది. పీడీ యాక్ట్ కింద ఎవరైనా జైలుకు వెళ్తే కనీసం మూడు నెలల నుంచి ఏడాది వరకు జైల్లో ఉండాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ విషయంలోనూ అదే జరుగుతుందా? లేక పీడీ యాక్ట్ పెట్టడంలో పోలీసుల పొరపాట్లను ఎత్తిచూపి ఆయన తరపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్‌పై బయటకు తెస్తారా అనే దానిపై చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు ఆయన లాయర్లు ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు కంటే ఎక్కువ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిదేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తం గా 2 వేల 573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా గత ఏడాది 664 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు.
సాధారణంగా పీడీ యాక్ట్ కేసులు అడ్వైజరీ బోర్డు పరిధిలో ఉంటాయి. ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డు.. పోలీసులు అందించిన పీడీ యాక్ట్ ప్రతిపాదనల్ని, కేసు వివరాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసు నమోదైన నెల రోజుల్లోపు ఎప్పుడైనా ఈ బోర్డు నిందితుణ్ని విచారిస్తుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించడంతోపాటు నిందితుడి నుంచి వివరాలు తీసుకుంటుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టినట్లు గుర్తిస్తే బోర్డు తన విచక్షణ మేరకు పీడీ యాక్ట్ వెంటనే ఎత్తివేస్తుంది. పోలీసులు అందించిన ఆధారాలు నిజమేనని నిర్ధారణ అయితే ఏడాదిపాటు జైల్లోనే నిర్బంధించాలని ఆదేశిస్తుంది.
అయితే పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన వారికి నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాలు ఉండవని న్యాయ నిపుణులు అంటున్నారు. అడ్వైజరీ బోర్డు విచారణ తర్వాతేపీడీ యాక్ట్‌ను సవాల్ చేస్తూ నిందితులు తమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా అడ్వైజరీ బోర్డు విచారణ తర్వాత హైకోర్టుకు వచ్చిన చాలా కేసుల్లో పీడీ యాక్ట్‌ను ఎత్తేశారు. పోలీసులు సరైన ప్రొసీజర్ పాటించకుండా, తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లోనూ పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారని కోర్టు పలు సందర్భాల్లో వారి తీరును తప్పుబట్టిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు జైలునుంచి బయటకు రావడం అనేది అడ్వైజరీ బోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టిఉంటుంది. అయితే పోలీసులుఎలాంటి కేసులు పెట్టారు.. వాటితీవ్రత ఎంత అనేదానిపై బోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com