RAJNATAH: కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకింది

RAJNATAH: కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకింది
తెలంగాణ అనుకున్నంత అభివృద్ధి చెందలేదన్న రాజ్‌నాథ్‌.. ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపు

పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదని, అభివృద్ధి ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారిపోయిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కారు బేకారు అయిపోయిందని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంలో KCRకుటుంబ ప్రభావం పెరిగిపోయిందన్న రాజ్‌నాథ్‌.. బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతి ఢిల్లీ వరకూ చేరిందంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజ్‌ అనేది నిరుద్యోగుల పాలిట క్రూయల్‌ జోక్‌ అంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు.


జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనగర్జన సభకు రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఒక కుటుంబ అభివృద్ధి మాత్రమే జరిగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం లేకుండా కేసీఆర్‌ ఉండలేరన్నారు. అధికారం వదిలేసి వచ్చేసిన వ్యక్తి ఈటల రాజేందర్‌ అన్నారు. యువకుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ తోడ్పాటు ఎంతో ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.

1984లో భాజపా రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిందని.. ఒకటి గుజరాత్ లో ఐతే రెండోది తెలంగాణ నుంచే అని ఆయన గుర్తుచేశారు. అందుకే బీజేపీకి తెలంగాణ ప్రజలతో ప్రత్యేకఅనుబంధం ఉందని వివరించారు భారాస సర్కారులో కేసీఆర్‌ కుటుంబ ప్రభావం పెరిగిపోయిందని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేశారని, నేరుగా కేసీఆర్‌ రంగంలోకి దిగినా ఈటలను ఓడించలేక పోయారన్నారు. ఎన్నికల సమయంలో చేసిన ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదన్నారు. ఏ పరీక్షలు జరిగిన లీకేజీలు ఉంటున్నాయని, ఇది ముమ్మాటికి లీకేజీల ప్రభుత్వం అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక్కరైనా అవినీతి పరులు లేకుండా ఉన్నారా చెప్పాలన్నారు. యువతకు ఉధ్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అభివృద్దికి బీజేపి కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ఇప్పటికి రెండు సార్లు గెలిపించారని, ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను గడ గడ లాడించిన గడ్డ హుజూరాబాద్‌ అన్నారు. ఉప ఎన్నిక సమయంలో వందల కోట్లతో ప్రలోభాలకు గురి చేసిన ప్రజలు తలొగ్గలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story