Bhuvanagiri: ప్రభుత్వాసుపత్రిలో దారుణం... మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సిబ్బంది యత్నించారు. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహాన్ని ఎలుకలు కొరకడాన్ని స్థానికులు ఫొటో తీయడంతో సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ఆదివారం ప్రగతినగర్‌కు చెందిన పెరికల రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ సమయంలో సిబ్బంది పట్టించుకోకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి.
దీనిని కొంతమంది గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూడగా ముఖం, చెంపలు, నుదుటి భాగంలో ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. అయినా సిబ్బంది పట్టించుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నం చేశారనే విమర్శలొస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com