అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం : సీఎం కేసీఆర్

KCR
అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. కాళ్లు, రెక్కలే ఆస్తులుగా ఉన్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న దళిత బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ దళితాభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర సాధన ఉద్యమంలా చేపట్టాలని.. దేశవ్యాప్తంగా ఈ పథకం విస్తరించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
దళిత బంధును విజయవంతం చేయడం ద్వారా తెలంగాణకే కాకుండా దేశ దళిత సమాజానికే హుజూరాబాద్ బాటలు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కళ్లలో సంతోషం కనిపిస్తోందన్నారు. అదే రీతిలో దళితుల ముఖాల్లో కూడా ఆనందం చూడాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఇక దళారులన్న మాటే ఉండదని.... అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం వచ్చి చేరుతుందని సీఎం స్పష్టం చేశారు. దళితబంధు అనేది ఒక పథకం కాదని, ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరు పాటుపడే యజ్ఞమని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com