TG: తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

TG: తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌
X
12 జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ ఎలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, లోలెవల్‌ వంతెనలు మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తం చేసింది.

కుండపోత వానలు

ఎడతెరపిలేని వానలతో తెలంగాణలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఏం రేవంత్‌రెడ్డి సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపైకి చెరువు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్‌ అయ్యింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా తరలిస్తున్నారు. మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరొచ్చింది. సత్తుపల్లిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మధిర మండలం కిష్టాపురం వద్ద పాలవాగు పొంగి ప్రవహించడంతో సాయంత్రం వైరా, మధిర మధ్య రాకపోకలు నిలిపివేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలో మల్లెపల్లి వద్ద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరదలో ఓ కారు చిక్కుకోగా స్థానికులు వచ్చి అందులోని ప్రయాణికులను రక్షించారు.

ఇంటి గోడ కూలి తల్లికూతురు మృతి

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలి తల్లి, కూతురు మృతిచెందారు. మరణించిన వారిని హనుమమ్మ, కూతురు అంజులమ్మగా గుర్తించారు.

Tags

Next Story