Telangana : తెలంగాణలో కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

Telangana : తెలంగాణలో కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
X
Telangana : భుముల ధరల పెంపు ప్రతిపాదనలతో.. ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం.. రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లకు క్యూకట్టారు.

Telangana : తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. భుముల ధరల పెంపు ప్రతిపాదనలతో.. ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం.. రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లకు క్యూకట్టారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చినవారి వాహనాలతో కార్యాలయ ప్రాంగణాలు రద్దీగా మారాయి.హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంది. ఎర్రగడ్డ, ముసాపేట, ఉప్పల్‌, నారపల్లి ఆఫీసులు.. రిజిస్ట్రేషన్లకు వేలాదిగా వచ్చిన ప్రజలతో నిండిపోయాయి. నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్‌, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ట్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులు తీరారు.

భూముల ప్రభుత్వ విలువను ఫిబ్రవరి 1 నుంచి పెంచడానికి.. సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. కనిష్టంగ 25శాతం, గరిష్టంగా 50శాతం వరకు భూముల విలువను పెంచడానికి రంగం సిద్ధమైంది. వ్యవసాయ భూములకు 50శాతం, ఖాళీ స్థలాలకు 35శాతం, అపార్ట్‌మెంట్‌ ప్లాట్స్‌కి 25శాతం మేర ధరలు పెంచాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేవాలని సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల విలువ పెరుగుదల అమల్లోకి రాకముందే.. రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రజలు రిజిస్ట్రర్‌ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ మహానగరంతో పాలు అన్నిజిల్లాల్లోనూ రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

భూముల విలువ పెంపునకు సన్నాహాలు ఇలా ఉంటే.. ఈ ప్రక్రియను వాయిదా వేయాలని క్రెడాయ్‌ కోరుతోంది. ట్రేడా కూడా ఈ మేరకు సర్కార్‌కు విజ్ఞప్తి చేసింది. భూముల ధరలు సవరించి 7నెలలు కాకముందే మళ్లీ పెంచడం ప్రజలకు భారంగా మారుతుందని క్రెడాయ్‌ అభిప్రాయపడుతోంది. ఇంకో 6నెలలు సమయం ఇచ్చి.. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని కోరుతోంది. కొవిడ్‌ మూడో దశ ఎఫెక్ట్‌తో మార్కెట్‌ మందకొడిగా ఉన్నందున.. రిజిస్ట్రేషన్‌, నాలా ఛార్జీలను కూడా తగ్గించాలి అంటున్నాయి క్రెడాయ్‌, ట్రేడా.

Tags

Next Story