Renuka Chowdhury: రాజ్‌భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరీ..

Renuka Chowdhury: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుక… కాళికలా మారారు. రెచ్చిపోయి పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఓ దశలో సహనం కోల్పోయి SI కాలర్ పట్టుకున్నారు. స్టేషన్‌కి వచ్చి మరీ కొడతా అంటూ హెచ్చరించారు. తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను తోసిపడేశారు. వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ తన నోటితోనే సమాధానం చెప్తూ.. చుట్టుముట్టిన పోలీసుల్ని నెట్టేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు.
హైదరాబాద్‌లో రాజ్‌భవన్ ముట్టడిలో పాల్గొన్న ఆమె.. కేంద్రం తీరుపై ఒంటికాలితో లేచారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ED విచారణ పేరుతో కక్షపూరితంగా వేధిస్తున్నారంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు. అటు తమ నిరసన అడ్డుకునేందుకు ప్రయత్నంచిన పోలీసులపై చెలరేగిపోయారు. రేణుక ఉగ్రరూపం చూసి కానిస్టేబుళ్లే కొంచెం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
మాజీ ఎంపీకి నచ్చచెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా శాంతించకపోవడంతో చివరికి బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు పావుగంటపాటు ఆవిడ ప్రతిఘటన కొనసాగింది. తీవ్ర వాగ్వాదం, తోపులాటల మధ్యే చివరికి రేణుకను కారెక్కించి స్టేష్‌కు తరలించారు. చలో రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంలో ఇవాళ 4 ఘటనల్ని ప్రధానంగా చెప్పుకోవాలి.
ఖైరతాబాద్ సర్కిల్‌లో టూవీలర్ తగలబెట్టి, బస్సుల అద్దాలు పగలగొట్టడంతో తలెత్తిన ఉద్రిక్తత వీటిల్లో మొదటిదైతే.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి సహా ముఖ్యనేతల అరెస్టు రెండోది. జగ్గారెడ్డి బారికేడ్లు దాటుకుని దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను ఎత్తిమరీ తీసుకెళ్లి వాహనంలో పడేశారు. ఇక మూడోది రేణుకా చౌదరి అరెస్టు. తనను అదుపులోకి తీసుకోవడానికి ట్రై చేసిన పోలీసులతో రేణుక వాగ్వాదానికి దిగడం, వారి తీరు నిరసిస్తూ తనదైన శైలిలో ప్రతిఘటించడం హైటెన్షన్‌కు దారి తీసింది.
ఇక నాలుగో ఘటన భట్టి అరెస్టు వేళ కనిపించిన సీన్. రాజ్‌భవన్ ముట్టడికి తరలివస్తున్న భట్టిని డీసీపీ జోయల్ డేవిస్ అడ్డుకున్నారు. వారిని వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్తత మరింత పెద్దది కాకుండా చూసేందుకు భట్టిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన DCP చొక్కా పట్టుకుని నిలదీశారు. ఇవాళ రాజ్‌భవన్ ముట్టడితో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కిన తీరుతో అడుగడుగునా టెన్షన్ వాతావరణమే కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com