REVANTH: న్యూయార్క్‌ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ

తనకు పదేళ్లు అవకాశం ఇస్తే.. న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తానని, న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. తనకు ఇక్కడ భూములున్నందు వల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. తన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ‘‘చంద్రబాబు, వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ వచ్చాయి. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి. చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకొంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా’’ అని రేవంత్ అన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భవిష్యత్తు తరాల కోసమే...
‘‘70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్(వయా అమరావతి)కి కేంద్రం ఒప్పుకొంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. ఈ విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్నివిధాలా ఆదుకుంటాం. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నాం. ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్‌సీడీఏ నుంచే చేపడతాం. సింగరేణికి పదెకరాల భూమి ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తాం. ఏడాది తిరిగే లోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com