REVANTH: అప్రమత్తంగా ఉండండి: రేవంత్

రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలి. నీటి పారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారమివ్వాలి. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలి. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారి కేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి' అని అన్నారు.
నిండుకుండలా "కడెం".. 17 గేట్లు ఎత్తి నీటి విడుదల
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 1,10,849 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు తరలివస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4571 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో గత 7 రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 693.8 అడుగులు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.699 కాగా.. 3,200 టీఎంసీలలో నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విట్టల్ రాథోడ్ సూచిస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
టోల్ ఫ్రీ నంబర్
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రహదారి ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తినా ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా 040-3517-4352 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్న కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటుంది. భారీ వర్షం, వరదల కారణంగా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడ్డా వెంటనే సంబంధిత నంబర్లకు సమాచారం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com