REVANTH: వరద బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

వరద బాధితులందరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. భాగాల వారీగా వరద నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో వరద నష్టాన్ని ఆయన పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జిని పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయ్యాయని, పంటలతో పాటు ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని సీఎంకు రైతులు, గ్రామస్థులు వివరించారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, పశుసంపదను కోల్పోయిన వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. “కొడంగల్ కు నేను ఎంత సాయం చేస్తానో… కామారెడ్డికి కూడా అంతే సాయం చేస్తా. ధైర్యంగా ఉండండి… ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరూ పరామర్శకు కూడా రాలేదని బాధపడిన వారికి సీఎం భరోసాతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ వందేళ్లలో రానంత వరద
“వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు. మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి.” అని వ్యాఖ్యానించారు.
సమన్వయం ఉండాలన్న సీఎం
కామారెడ్డి జిల్లాలో వరదనష్టంపై కలెక్టరేట్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే.. వరద నష్టాలను తగ్గించగలమని రేవంత్ అన్నారు. ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరమో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు, తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com