REVANTH: "ఢిల్లీ మోడీ అయినా..గల్లీ కేడీ అయినా.. మేం రెడీ"

ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా.. రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై రేవంత్ విమర్శలు గుప్పించారు. కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్, రుణ మాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. . హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయ విజయ భేరి సభలో ప్రసగించిన సీఎం... తెలంగాణ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే.. నేను క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. సీఎం మాట్లాడుతూ.. గత పాలకుల 'దొరల గడీ'కి తెరదించి.. ప్రజలకు అండగా నిలిచామని, తమ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని గతంలో ఎగతాళి చేసిన వారికి, నేడు విజయవంతమైన ప్రజా పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలుతో సమాధానం చెబుతున్నామని ఆయన ఉద్ఘాటించారు. తాము ఎక్కడ విఫలం అవుతామా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులా, కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద రూ.9,000 కోట్లను 70 లక్షల మంది రైతులకు అందించామని పేర్కొన్నారు.
చర్చకు సిద్ధం
" రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదాం. మోదీ వస్తారో? కేసీఆర్ వస్తారో రండి.. మేం చర్చకు సిద్ధం. రైతు భరోసా విఫలమవుతుందని గొతికాడ నక్కల్లా కొందరు ఎదురుచూశారు. కానీ 9 రోజుల్లో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేశాం. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. పేదలకు సొంత ఇళ్లు, సొంత భూమి ఉందంటే అది ఇందిరమ్మ ఇచ్చిందే’ అని చెప్పారు. ‘పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. అలాంటి వారిని గుడ్డలూడదీసి కొడితే కానీ బుద్ధి రాదు. అలాంటి వారికి బుద్ధి చెబితే కానీ ఇందిరమ్మ గొప్పదనం తెలియదు. సోషల్ మీడియాలో మన కార్యకర్తలు యుద్ధం ప్రకటించాలి. ఈ యుద్ధంలో కల్వకుంట్ల గడీ తునాతునకలు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ నాయకులు రైతులు వరి వేస్తే ఉరి వేసుకోవాలని బెదిరించారని, తమ ప్రభుత్వం వరి పండించిన రైతులకు బోనస్లు ఇచ్చి.. ‘రైతే రాజు’ అనే మాటను నిజం చేస్తోందని రేవంత్ గుర్తు చేశారు. సంక్షేమ పథకాలలో మహిళలకే పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com