REVANTH: కేసీఆర్‌... విచారణకు సిద్ధమా..?

REVANTH: కేసీఆర్‌... విచారణకు సిద్ధమా..?
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌.. కేసీఆర్ పాలన అవినీతిమయ్యమన్న సిద్ధరామయ్య

ప్రజా ప్రతినిధుల కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కామారెడ్డిని బంగారు తునక చేస్తానంటూ ఇక్కడి ప్రజల భూములు దోచుకునేందుకు ఆయన వస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి ప్రజల తీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోందన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌ సహా సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కొడంగల్‌లో రెండు రోజుల క్రితమే నామపత్రాలు సమర్పించిన ఆయన కామారెడ్డిలో పత్రాలు దాఖలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెంటరాగా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు.


ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్‌ సిద్ధమా?.. విచారణకు నేను సిద్ధం సవాల్‌ విసురుతున్నా.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయాలంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జనగాం జిల్లాగా పేరు మారుస్తామని రేవంత్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్‌ పేర్కొన్నారు.


కామారెడ్డిలో జరిగిన బీసీ గర్జన సభలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాష్ట్రంలో ఐదు హామీలపై కేసీఆర్ విమర్శలను కొట్టి పారేశారు. వెనకబడిన వర్గాల అభివృద్ధిపై మోదీ, కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించిన ఆయన కర్ణాటక ప్రజలకిచ్చిన 5గ్యారంటీల అమలు తీరును కేసీఆర్‌ వస్తే చూపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి KCR పదేళ్ల పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కేసీఆర్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్న ఆయన ఓటుతో కేసీఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ పనైపోయిందని బీజేపీకి నాలుగైదు సీట్లు వస్తే అదే చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. మోదీ నాలుగైదు సార్లు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని సిద్ధరామయ్య అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story