REVANTH: సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ఛానెల్‌లో నిధులు

తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హాస్టళ్లలో బోధన, బోధనేతర సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేయాలన్నారు. పూర్తి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించాలని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమశాఖలపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, వారికి చేరుతున్నాయో లేదో ధ్రువీకరించాలని చెప్పారు. రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాలకు ప్రతి నెలా గ్రీన్‌ఛానెల్‌లో నిధులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరుకు ముఖగుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో అత్యవసర పనుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో..
ప్రతి హాస్టల్లో మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి డేటాను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని, హాస్టళ్లను సమీపంలోని వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించి ఆరోగ్య తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ప్రతినెలా గ్రీన్ ఛానెల్లో నిధులు అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నిధులను తాత్కాలిక సిబ్బంది వేతనాలు, వసతి గృహాల్లో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించాలని సూచించారు. సోమవారమిక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సంక్షేమశాఖలపై సమీక్ష నిర్వహించారు. గురుకుల సొసైటీల నిధులకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com