REVANTH: తెలంగాణకు రక్షణశాఖ భూములు ఇవ్వండి

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరం అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ముఖ్యంగా, మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణానికి భూమి అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు.
నితిన్ గడ్కరీతోనూ భేటీ
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ రేవంత్ సమావేశమయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణకు సముద్ర రేవు లేనందున.. బందరు పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందని... మిగతా భాగం ఏపీలో ఉంటుందని సీఎం వివరించారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన రేవంత్.. తెలంగాణ విద్యా రంగంలో సమూలమార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి అవసరం అయ్యే ఆర్థిక వనరుల సమీకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com