REVANTH: నిరుద్యోగులకు శుభవార్త... త్వరలోనే 40 వేల ఉద్యోగాలు

రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరువలేనిదని ఈ ప్రాంతం నుంచే బహుజనులుదుండు కట్టి ఉద్యమించారని చెప్పారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని 2004లో కరీంనగర్ గడ్డ నుంచే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు చరమగీతం పాడారు. శ్రీకాంతాచారి బలిదానం జరిగింది కూడా ఇదే రోజు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం నిర్వహించిన ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవ సభ’కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ ఏకమై సర్పంచ్ లను ఏకగ్రీవం చేసుకోవాలని లేదా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మెలిసి పని చేసే వారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో కాళ్లలో కట్టెలు పెట్టేవారిని ఎన్నుకుంటే అది వారికి రాజకీయంగా పనికి వస్తుందేమో కానీ మీ గ్రామాభివృద్ధికి నిధులు రావన్నారు. కేంద్రంతో కొట్లాడైనా అత్యధిక నిధులు గ్రామాలకు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. కిరికిరి సర్పంచ్ లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో రూ. 262.78 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుతో పాటు రూ. 20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే, రూ. 8.60 కోట్లతో RTA యూనిట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేశారు.
రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్- కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్- అక్కన్నపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీరందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టును నెహ్రూ హయాంలో మొదలు పెడితే కాలక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్నీ మా ప్రభుత్వాల హయాంలోనివే. ఈ రోజు వరిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో మనదే మొదటి స్థానం. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘రూ.14 వేల కోట్ల వ్యయంతో సన్న బియ్యాన్ని పేదలకు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుంది’’అని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ యువత భవితకు బంగారు బాటలు వేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలి’’ అని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల కిందట ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తుంది. ఇదే మైదానంలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి ఫలాలు అందించి చూపిస్తున్నాం.’అని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

