REVANTH: దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం: సీఎం

మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘లోక్‌సభ సీట్ల పెంపు విషయంపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికీ తెలుసు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో.. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని భాజపా చూస్తోంది. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తుంది. భవిష్యత్‌లో దేశాన్ని బలహీనం చేస్తుంది. ఏ పార్టీకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డీపీని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
