REVANTH: కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తాం

REVANTH: కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తాం
X
పార్టీకి డీసీసీ అధ్యక్షులే మూల స్తంభమన్న ముఖ్యమంత్రి

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ శక్తివంతంగా నిలవాలంటే క్రమశిక్షణ, సమిష్టి కృషి, ప్రజాస్వామ్య భావజాలం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పార్టీకి మూలస్తంభాలని పేర్కొంటూ, బాధ్యతలను అధికారం అన్న భావనతో కాకుండా సేవా దృక్పథంతో నిర్వర్తించాలని సూచించారు. వికారాబాద్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి నాయకుడి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రతిభ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, దాన్ని దుర్వినియోగం చేయకూడదని హెచ్చరించారు. “డీసీసీ అనేది అధికారం కాదు, అది కుటుంబ పెద్ద బాధ్యత లాంటిది” అని వ్యాఖ్యానిస్తూ, జిల్లాపై మాదే ఆధిపత్యం అన్న భావన కలిగితే అది మొదటి తప్పిదమని తెలిపారు.

భిన్నాభిప్రాయాలు సహజమని, అవి కొత్తవి కాదని ఆయన గుర్తుచేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే కాంగ్రెస్‌లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయని, వాటిని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా స్వీకరించాలన్నారు. విభేదాలు ఉన్నవారిని పార్టీ నుంచి బయటకు పంపాలని ప్రయత్నిస్తే అది పార్టీకి నష్టం కలిగించడమే అవుతుందని హెచ్చరించారు. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉందని, అప్పట్లో పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నానన్నారు. అయితే ప్రతి నేత ఇంటికి వెళ్లి కలుసుకుని, తాను వయసులోనూ అనుభవంలోనూ చిన్నవాడినే అయినప్పటికీ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని గౌరవించాలని, అందరూ సహకరించాలని కోరానని చెప్పారు. తన ఆలోచనలను స్పష్టంగా వివరించి నేతలను ఒప్పించగలిగానని తెలిపారు. సమిష్టి కృషి ఫలితంగా పార్టీ ఓటింగ్ శాతం 2.5 శాతం నుంచి 40 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు. కష్టపడి పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, టికెట్ రాకపోయిన వారికి ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించామని చెప్పారు. అదనంగా పార్టీ కోసం శ్రమించిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అందజేశామని వివరించారు.

శిక్షణా కార్యక్రమాలను శిక్షగా భావించవద్దని సూచించిన రేవంత్ రెడ్డి, ఇవి నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయని అన్నారు. వారసత్వంగా అవకాశాలు రావని, కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో కూడిన సేవా భావం, పరస్పర గౌరవం అవసరమని ఆయన తేల్చిచెప్పారు.

Tags

Next Story