REVANTH: చక్క నీరు వదలం.. మూసీ సుందరీకరణను విడవం

ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.‘‘ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనది. సాయుధ పోరాటస్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టాం. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్‌మోడల్‌గా ఉన్నాం. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలి. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నాం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తాచాటారు.
నీటి వాటాల విషయంలో రాజీలేదు
గోదావరి జలాలకు సంబంధించి నీటి వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్ది ప్రతి నీటి చుక్కపై హక్కలు సాధిస్తామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తప్పకుండా దక్కించుకుంటామని పేర్కొన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
మూసీ సుందరీకరణతో కొత్త ఆర్థిక వ్యవస్థ
మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ సుందరీకరణ ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. 2050 మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా మూసీ పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. "మూసీ నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం." అని రేవంత్ తెలిపారు.
ఫాంహౌస్‌లో గంజాయి పండిస్తే...
హైదరాబాద్ డ్రగ్స్‌కు గేట్ వేగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రగ్స్ కట్టడి చర్యలు కొందరికి నచ్చకపోవచ్చని, కానీ ఈ వ్యాపారంలో ఎంత పెద్దోళ్లు ఉన్నా కనికరించేది లేదని స్పష్టం చేశారు. ఫాంహౌస్‌లలో గంజాయి పండించి సరఫరా చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్నారు.
అమర వీరులకు సీఎం నివాళి
తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య స్ఫూర్తిని సీఎం రేవంత్ కొనియాడారు. అమర వీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. డిసెంబర్ 7, 2023ను కూడా మరో చారిత్రక రోజుగా చెప్పిన ఆయన.. గత బీఆర్ఎస్ నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలనను తిరిగి స్థాపించినట్లు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటం... ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పోరాటం ద్వారా సామాన్య ప్రజలు నిజాం రాచరికాన్ని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని స్థాపించారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com