REVANTH: మావోలూ రండి.. తెలంగాణను పునర్నిర్మిద్దాం

తెలంగాణలో మావోయిస్టు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసకు ఎలాంటి స్థానం లేదని ఆయన తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వదిలి సమాజ ప్రధాన ప్రవాహంలోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. వారు లేవనెత్తే సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లోని ఐసీసీసీ కేంద్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు చూడని విధంగా మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీలు విజయ్ కుమార్ (ఇంటెలిజెన్స్), అనిల్ కుమార్ (గ్రేహౌండ్స్), అలాగే ఎస్ఐబీ చీఫ్ సుమతి ఈ సమావేశానికి హాజరయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం అందజేయడంతో పాటు వారు అప్పగించిన ఆయుధాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎలాంటి సమస్యలకైనా హింసాత్మక మార్గం కాకుండా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాన్ని ఉదాహరణగా చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి అంశాలపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్జీతో తాను సుదీర్ఘంగా చర్చించినట్లు సీఎం వెల్లడించారు. మావోయిస్టుల అభిప్రాయాలు, సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచినట్లయితే వాటిని గణపతి సహా మిగిలిన నాయకులకు తెలియజేస్తామని దేవ్జీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలిగితే దేశవ్యాప్తంగా సీపీఐ (ఎంఎల్) సంస్థను రద్దు చేయడానికి కూడా సిద్ధమని కొందరు నేతలు చెప్పినట్లు సీఎం వివరించారు. మావోయిస్టుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం గమనించిందని ఆయన అన్నారు. అయితే వారి కొంతమంది డిమాండ్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. అందుకే తాను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో లొంగుబాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు తుది పరిష్కారం బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలట్ ద్వారా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అదే నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
