REVANTH: చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఉస్మానియా

ఉస్మానియా యూనివర్శిటీకి మళ్లీ వస్తానని.. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్‌లో మీటింగ్ పెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మళ్లీ వచ్చిన రోజు ఓయూలో పోలీస్ పహారా వద్దు.. బారికేడ్లు అడ్డుపెట్టొదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే స్వేచ్ఛనివ్వాలని.. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్త శుద్ధి తనకు ఉందన్నారు. అప్పుడు విద్యార్థులు నినసన తెలిపినా తాను ఏమీ అనబోనని వాళ్లు లేవనెత్తిన సమస్యలపై అదేరోజు అక్కడికక్కడే సమాధానం చెబుతానని అన్నారు. నేను మల్లోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్టు చేయకండని పోలీసులను ఆదేశించారు. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని సీఎం తెలిపారు. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దుందుభి, బీమా వసతి భవనాలను సీఎం ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్‌రెడ్డి, కోదండరామ్, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీ
ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ.కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. అయినా.. మీకు ఎందుకంత శునకానందం అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నరసింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి సైతం ఈ యూనివర్సిటీ విద్యార్థేనని పేర్కొన్నారు.
చదువొక్కటే మార్గం
" విద్యార్థులకు నేను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. నేను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలను నియమించాను. చదువు ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి." అని రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవ మృగాలు ఫామ్ హౌస్‌లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమ లావాదేవీలు జరిగాయని, ఫామ్ హౌస్‌లు అవినీతి కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత స్వార్థ లాభాలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com