Revanth Reddy: బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మేల్యేలపై విచారణ జరపాలి

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరారు. 12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు. జనవరి 6న మొయినాబాద్ పీఎస్‌లో దీనిపై ఫిర్యాదు చేశామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చామన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ కేసు నెంబర్ 455లో తమ ఫిర్యాదును కూడా జత చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు, 25మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని రేవంత్ తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ రకాల లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com