Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ వివాదం.. కేసీఆర్‌కు బీజేపీ నాయకుల లేఖ..

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ వివాదం.. కేసీఆర్‌కు బీజేపీ నాయకుల లేఖ..
Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ విషయంపై సీఎం కేసీఆర్‌కు.. బీజేపీ నాయకులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

Basara IIIT: సీఎం కేసీఆర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలపై నీరో చక్రవర్తిగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై, పొలిటికల్‌ స్ట్రాటజిస్టులు, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది కానీ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం సమయం చిక్కదని ఎద్దేవా చేశారు.

కేటీఆర్‌ విదేశీ పర్యటనకు, కేసీఆర్‌ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని.. ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధులు కేటాయించడానికి ముందుకు రావడం లేదన్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు బండి సంజయ్‌.

మంత్రులు, అధికారులు.. విద్యార్థులతో మైండ్ గేమ్‌ ఆడటం మానుకోవాలన్నారు. సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్ర ప్రభుత్వం దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించాలన్నారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌. విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తూ జైలు లాంటి జీవితం గడుపుతున్నారన్నారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే.. కరెంట్ నిలిపివేసి, మంచి నీళ్లు బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలన్నీ ముమ్మాటికి మానవ హక్కలు ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు.

ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు.. తమ లాంటి వారు వెళుతుంటే అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ జూన్ 15న ట్వీట్ చేశారన్నారు రేవంత్‌రెడ్డి. ఇది చెప్పి కూడా 5 రోజులు అయిందని.. ఎటువంటి అతీగతీ లేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం మూలంగా ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్‌ ఐటీ న్యాక్ దృష్టిలో సి-గ్రేడ్ ర్యాంకుకు పడిపోయిందని పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యువతకు లక్షల ఉద్యోగాలు ఏటు నుంచి వస్తాయన్నారు. దాదాపు 8 వేల విద్యార్థులు అందోళన చేస్తుంటే భోజనం పెట్టమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. ఇంత జరుగుతుంటే వేగంగా స్పందించాల్సిన మీరు అసలు రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదని అన్నారు. విద్యార్థులు వారం రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళనలు చేస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం 5 నిమిషాల సమయం కేటాయించే తీరిక కూడా దొరకడం లేదా? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story