REVANTH: ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. బాధితులు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్ వేదికగా అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం, పంటనష్టం, పశుసంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోండని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని వదిలేస్తే కుదరదు, మంత్రులు, కలెక్టర్లు నివేదికలు రెడీ చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. "తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలి. కేంద్రం నిధుల విషయంలో అలసత్వం వద్దు. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.” అని రేవంత్ అన్నారు
ఆర్థిక సాయానికి ప్రణాళికలు
వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ ఆదేశించారు. వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ.5 లక్షలు పరిహారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు సంబధించి వివరాలు సేకరించాలని.. పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలన్నారు. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. "ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు..ఎకరా పంట నష్టానికి రూ.10వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలి. ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలి. అధికారులు నిర్లక్ష్యం వదలండి క్షేత్రస్థాయికి వెళ్లండి.. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

