REVANTH: రెండంకెల స్థానాలు గెలుస్తాం
తెలంగాణలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆరేడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్న ఆయన తెలంగాణలో బీజేపీ వేవ్ అంటూ ఏమీ లేదన్నారు. మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కు కనీసం 20 వేల మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్లకు అటో ఇటో వస్తాయన్నారు. భారాస శ్రేణులు పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి పని చేశాయని రేవంత్ ఆరోపించారు..
రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని ఇక పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు రుణమాఫీ సహా ఇతర సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామన్న రేవంత్ దాని ద్వారా రుణం తీసుకుని రైతురుణ మాఫీ చేస్తామని అన్నారు. ఈనెల 6 నాటికి రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామన్న ఆయన రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ప్రతి అంశం.... అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని అది నిరంతర ప్రక్రియని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉందన్నారు. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తానని చెప్పిన ఆయన.... హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశం లేదన్నారు. దేశానికి రెండో రాజధానిగా మార్చినా తెలంగాణ ఆదాయానికి ఇబ్బంది లేదని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైనా... కలిసి పనిచేస్తామన్న రేవంత్ .... సుహృద్భావ వాతావరణంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.
‘‘ఆరేడు స్థానాల్లో భారాసకు డిపాజిట్లు కూడా రావు. మెదక్‌లో భాజపా మూడో స్థానంలోకి వెళ్లింది. ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసి ఉంటే అంచనా వేయడం సులువు. భారాస శ్రేణులు పూర్తి స్థాయిలో భాజపాకు పనిచేశాయి. భాజపాకు కేంద్రంలో 220కి పది అటో, ఇటో వస్తాయి. ఇవాళ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటే 13 స్థానాలు వస్తాయని సమాచారం ఉంది. ఇంతటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయి. ఇప్పటినుంచి పరిపాలనపై దృష్టి ఉంటుందని రేవంత్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com