Revanth Reddy : సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర : రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు... తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి. రచ్చరచ్చ చేస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, కాంగ్రెస్‌లు ధర్నాలు, ఆందోళనతో హోరెత్తిస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతుంటే.. టీఆర్‌ఎస్ సమర్థించుకుంటోంది. కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారింది.
సీఎం కేసీఆర్ రాజ్యాంగ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ పూర్తి స్థాయిలో సమర్థించారు. కేసీఆరే నిజమైన అంబేద్కర్‌వాది అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఇప్పటికీ 105 సార్లు సవరించారని, అలా సవరిస్తే అంబేద్కర్‌ను అవమానించినట్లా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో రాజ్యాంగాన్ని సవరించడానికి ఓ కమిటీని వేశారని.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణకు, దళితులకు, రైతులకు జరిగిన అన్యాయాల గురించి లేవనెత్తితే.. సమాధానం చెప్పలేకనే విపక్ష నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్‌నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం, టీఆర్‌ఎస్ ముక్త్ తెలంగాణ కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో సూత్రధారి ప్రధాని మోదీ అయితే.. కేసీఆర్ పాత్రదారి అన్నారు. ఢిల్లీలో అంబేద్కర్ సాక్షిగా దీక్ష చేశామని చెబుతున్న బీజేపీ తెలంగాణ ఎంపీలు... ఈ విషయంలో కేసీఆర్‌పైన ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com