REVATH: గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు గూడుపుఠాణీ

గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాణీ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను కేటీఆర్, హరీశ్‌రావు రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్.. ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని రేవంత్ మండిపడ్డారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. డిసెంబరు 9వ తేదీ నాటికి గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు, డీఎస్సీ ద్వారా 11,500 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పరీక్షలు వాయిదా పడాలని కుట్రలు పన్నుతున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏవేవో అభ్యంతరాలు తెలియజేస్తున్నారన్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వారిద్దరు యువతను రెచ్చగొట్టడం వల్లే గతంలో చాలా మంది పేదల పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని.... ఆ నేతల కుటుంబాలు మాత్రం బాగున్నాయన్నారు.
కేటీఆర్, హరీశ్ రావులకు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని.. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవనే ఇలా కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదన్నారు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చో అని రేవంత్ అన్నారు. నాలుగు రోజులుగా హరీష్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.... తనదాకా వస్తే గాని వాళ్లకు నొప్పి తెలియలేదు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాణీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలు ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com