TS: మా ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరు

TS: మా ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరు
ఇంద్రవెల్లి సభలో సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించిన రేవంత్‌..... 15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని ఆ సాహసం చేస్తే ప్రజలే వారిని తరిమికొడతారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి..త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్ , 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరిన సీఎం.... కేస్లాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేంసాగర్‌, సీఎస్‌ శాంతికుమారి.... ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి నాగోబా ఆలయానికి వెళ్లారు. నాగోబా దర్శనానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి మోస్ర వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేస్లాపూర్‌ నుంచి రోడ్డుమార్గాన ఇంద్రవెల్లి చేరుకున్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఇంద్రవెల్లి రణస్థలిలో అమరులైన వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు, అనంతరం, అమరవీరుల స్మృతివనం పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. పర్యటనలో భాగంగా తాగునీటి సౌకర్యం, గిరిజన సంక్షేమ రోడ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.


బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోడీకి కేసీఆర్‌ తాకట్టు పెడతారని ఆక్షేపించారు. మూడునెలల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్‌ అవుతారని భారాస నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చితే..ప్రజాక్షేత్రంలో ఛీత్కారం తప్పదని హెచ్చరించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభలో పార్లమెంటరీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పుచేసిన నాటి సీఎం కేసీఆర్‌ ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్‌ ధ్వజమెత్తారు.

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా త్వరలోనే రెండు గ్యారంటీలు 500కు గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. ఆదిలాబాద్‌ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకునేలా ఇందిరమ్మ సర్కార్‌ పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి పథాన నిలుపుతామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పునర్నిర్మాణ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story