తెలంగాణ

Revanth Reddy : స్పీడ్‌ పెంచిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Revanth Reddy : ఓవైపు పార్టీలో పరిస్థితులను చక్క పెడుతూనే మరోవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

Revanth Reddy : స్పీడ్‌ పెంచిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
X

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఓవైపు పార్టీలో పరిస్థితులను చక్క పెడుతూనే మరోవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పార్టీలో క్యాడర్ టూ లీడర్ అందర్నీ యాక్టివ్ చేసిన పీసీసీ చీఫ్‌.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతరేక విధానాలపై పోరుబాటను ఉదృతం చేశారు. పార్టీ క్యాడర్ అంతా ఏదో ఒక ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు... విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై చేపట్టిన జంగ్ సైరన్ సభలు... వరి రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలు... పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన నిరసన ధర్నాలు సక్సెస్ అయ్యాయి.

ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఘర్‌వాపసీ చేపట్టారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కొందరు మాజీలను తిరిగి కాంగ్రెస్‌ కూటికి వచ్చేలా చేశారు. ఇపుడు టీఆర్ఎస్, బీజేపీల ఆపరేషన్ ఆకర్ష్‌కు కౌంటర్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఆ రెండు పార్టీల్లోని బలమైన నాయకులను, అసంతృప్తులను తమవైపు లాక్కునేందుకు పక్కా స్కెత్‌తో ముందుకెళుతున్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌, బీజేపీల ఆపరేషన్ ఆకర్ష్‌కు విలవిల్లాడిన హస్తం పార్టీకి ఈ కౌంటర్ పాలిటిక్స్‌తో కొత్త ఉత్సాహం నింపుతున్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలోని నియోజకవర్గాల వారీగా పార్టీల నాయకుల బలబలాలు, సామాజిక సమీకరణలు కలగలుపుతూ అవసరం ఉన్న దగ్గర ఆపరేషన్ ఆకర్ష్ అమలు పరుస్తున్నారు రేవంత్. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ రెబల్ క్యాండిడేట్ గండ్ర సత్యనారాయణను పార్టీలోకి రప్పించిన రేవంత్.. ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను జిల్లాల వారీగా గుర్తించి కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకెళుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో బలమైన నాయకుడు, టీఆర్‌ఎస్‌ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకునే లా పావులు కదిపారు రేవంత్. ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న డీఎస్.... కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరికకు కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూలంగా ఉండటంతో .. ఇక రేవంత్ తనవంతు పాత్రను స్పీడ్‌గా నిర్వహించారు. రేవంత్ నేరుగా డీఎస్ ఇంటికి వెళ్ళి మరీ మంతనాలు జరిపారు.

రాజకీయంగా మంచి చాణక్యం తెలిసిన నాయకుడిగా డీఎస్‌కు పేరుంది. అన్ని జిల్లాల నేతలతో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు బీసీ వర్గాల్లో బలమైన నాయకుడు. మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఆయనే పెద్దదిక్కుగా ఉన్నారు. దీంతో డీఎస్‌ చేరిక కాంగ్రెస్‌కు రాజకీయంగా కలిసి వస్తుందనే భావన రేవంత్ రెడ్డిలో ఉంది. టీఆరెఎస్ లో మరి కొందరు నాయకులు రేవంత్ కు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ ఇన్నర్ సర్కిల్ లో టాక్. అయితే వాళ్ళ చేరికకు మరికొంత సమయం పడుతుందనీ చెబుతున్నారు. సరైన సమయంలో గులాబీ పార్టీలో కీలక నేతలను చేర్చుకొని కేసీఆర్ కు షాక్ ఇస్తామని చెబుతున్నారు హస్తం నేతలు.

ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ పై కూడా పీసీసీ చీఫ్‌ రేవంత్ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్ధన్ రెడ్డి ని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఆయన చేరికపై జిల్లా కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు వ్యతిరేకించినా .. పట్టుబట్టి హర్షవర్ధన్ కు కాంగ్రెస్ కండువా కప్పారు రేవంత్. ప్రస్తుతం 317 జీవో పై ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్న సమయంలో ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్ధన్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా పార్టీ కి బలం చేకూరుతుందని రేవంత్ భావిస్తున్నారు.

మరో వైపు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే .. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ వైపుకు ఆకర్షించారు రేవంత్. ముదిరాజ్ సామాజిక వర్గం లో బలమైన నాయకుడుగా ఉన్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఆ పార్టీ కు మంచి బలాన్నిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ కు కొత్త కళ వచ్చింది. గడ్డు పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ లోకి వలసల హడావిడీ చూస్తుంటే రేవంత్ నేతృత్వంలో ఇక కాంగ్రెస్ కు పూర్వవైభవం సాధ్యమనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది.

Next Story

RELATED STORIES