REVANTH: సీఎంతో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ!

దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పుడు ప్రజాస్వామ్య బాట పట్టారు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆరుగురు అగ్రనేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇటీవల డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి (గంగన్న)తో పాటు సుజాతక్క, చంద్రన్నలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అసెంబ్లీలో ప్రకటన చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మావోయిస్టు నేతలతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వీరి లొంగుబాటుపై త్వరలోనే అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారు చట్టపరిధిలో ఉంటూ సమాజ సేవ చేసుకోవచ్చని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పునరావాసంలో భాగంగా వారికి ఇల్లు, ఉద్యోగం, జీవనభృతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
తుపాకీ సిద్ధాంతం ఇక సాధ్యం కాదు: దేవ్‌జీ
ముఖ్యమంత్రితో భేటీ తర్వాత మాజీ నేత దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదు, అందుకే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన పేర్కొన్నారు. తమ పునరావాసం కోసం ప్రభుత్వం నుంచి కొన్ని డిమాండ్లను కోరినట్లు వెల్లడించారు. లొంగుబాటు రివార్డును రూ. కోటికి పెంచాలని కోరారు. సాగు కోసం ఐదెకరాల భూమి ఇవ్వాలని కోరగా, భూమి సాధ్యం కాదని సీఎం తెలిపారు. జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి, అందరం కలిసి లొంగుబాట్లపై ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
