సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి దీక్ష..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో శ్రేణుల్లో నయాజోష్ కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ... దళిత వర్గాలకు ఏడేళ్లలో జరిగిన అన్యాయాన్ని రేవంత్‌రెడ్డి ఎండగడుతున్నారు. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాల సభలతో హోరెత్తించిన కాంగ్రెస్ పార్టీ .. కార్యాచరణకు మరింత పదును పెంచింది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలు కొనసాగిస్తూనే...రెండ్రోజుల దీక్షకు డిసైడ్ అయింది.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి మేడ్చెల్ నియోజక వర్గంలో.. రెండు రోజుల పాటు దళిత గిరిజన దండోరా దీక్షకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి వేదిక చేసుకున్నారు ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఉదయం 11గంటలకు రేవంత్ రెడ్డి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం మూడుచింతలపల్లిలోని దళితవాడలో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఒక వైపు దళిత గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడుతూనే... మరో వైపు కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో దుస్థితిని ప్రజల దృష్టికి తెచ్చేదుకు మూడు చింతల పల్లిని వేదిక చేసుకున్నట్లు చెబుతున్నారు రేవంత్‌రెడ్డి.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దీక్షపై టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలను ...ఏమేరకు పరిష్కరించావో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాద్గిరిపల్లి ఉద్దమరి నుంచి ఆదర్శపల్లి వెళ్లే మార్గాన్ని ఆర్మీ అధికారులు మూసివేసినా...సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న రేపటి దీక్షకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభకు వర్షం ఆటంకం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేశారు. 20వేల అడుగుల్లో దీక్ష స్థలాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో శ్రేణులు హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com