REVANTH: ఇకపై రెవిన్యూ డివిజన్ స్థాయిలో ‘ప్రజావాణి’ సేవలు

REVANTH: ఇకపై రెవిన్యూ డివిజన్ స్థాయిలో ‘ప్రజావాణి’ సేవలు
X
మండలస్థాయిలోనూ అమలు చేసేందుకు చర్యలు

తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత వ్యవస్థీకృత విధానాన్ని తీసుకురావాలనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు నేరుగా ప్రభుత్వాన్ని చేరువ చేసే వేదికగా నిలుస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదులు త్వరగా పరిష్కారం కావాలంటే సేవలు గ్రామీణ స్థాయికి చేరుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు ఒకే వేదికపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహణ కొనసాగుతోంది.

అయితే దూర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లేదా జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎంవో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని సూచించారు. తరువాతి దశలో మండల స్థాయికి కూడా విస్తరించే ప్రణాళికను వెల్లడించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదు పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆ గడువులోపే చర్యలు పూర్తి కావాలని అన్నారు. అలాగే పరిష్కార ప్రక్రియలో పారదర్శకత ఉండేలా అర్జీదారులకు పురోగతిని నిరంతరం తెలియజేయాలని సూచించారు. ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని కూడా ఆదేశించారు.

రాష్ట్రం నుంచి జిల్లా వరకు ప్రతి స్థాయిలో ఫిర్యాదులపై రియల్ టైమ్ మానిటరింగ్ ఉండే విధంగా వ్యవస్థను రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి విభాగంలో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి బాధ్యతను నిర్దిష్టంగా అప్పగించాలని అన్నారు. ఒక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే, ఆటోమేటిక్‌గా పైస్థాయికి వెళ్లే విధంగా ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రతి అంశాన్ని పర్యవేక్షించే విధానం ఉండాలని అన్నారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఈ సేవలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Tags

Next Story