Telangana : రేపే సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇతర నేతలతో చర్చించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేవంత్‌కే పాలనా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రివర్గ కూర్పుపైనా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
చర్చోపచర్చలు, సంప్రదింపుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అభ‌్యర్థిపై ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. అంతా ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదించింది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ, ఎమ్మెల్యేల తీర్మానంతో దిల్లీ వెళ్లిన AICC పరిశీలకులు DK శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే AICC అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. చర్చల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరునే రాహుల్ గాంధీ సూచించారు. ఖర్గే కూడా అందుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీ వచ్చిన ఉత్తమ్, భట్టిలతో కె.సి. వేణుగోపాల్ 40 నిమిషాలు చర్చించారు. అనంతరం సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఢిల్లీలో మంత్రివర్గకూర్పుపైనా చర్చిస్తున్న అధిష్టానం హైదరాబాద్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని తక్షణం ఢిల్లీ రావాలని ఆదేశించింది. ఈమేరకు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. రేపు CMగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును భారీగా పెంచారు.
అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటింటిన పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ MLAలు తెలిపారు. అందరం కలిసి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి అధికారాలన్నీ ఒకే కుటుంబం వద్ద కాకుండా సబ్బండ వర్గాల నేతలకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనను ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఖర్గే, సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ , డీకే శివకుమార్ , ఠాక్రేకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో అండగా నిలిచిన కాంగ్రెస్ సైనికులకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com