Revanth Reddy : సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై

Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులో అవినీతిపై "ది న్యూస్ మినిట్" అనే పోర్టల్ ఆధారాలతో సహా ప్రచురించిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్.
ప్రాజెక్టు పనులు చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని కథనంలో పేర్కొన్నారన్నారు. రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులకు కాళేశ్వరం కాంట్రాక్టు పొందిన..మేఘా దాని షెల్ కంపెనీల చెల్లింపులు చేశాయన్నారు. వివాహ వేడుకకు షెల్ కంపెనీలు 50లక్షలకు పైగా రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సాగునీటిశాఖ సీఎం దగ్గరే ఉందన్నారు రేవంత్ రెడ్డి.
ఆరోపణలు వచ్చిన అధికారి కేసీఆర్ పర్యవేక్షణలోనే పనిచేస్తున్నారని తెలిపారు. 2 రోజులు దాటినా ఆరోపణలపై ఖండన రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్ నుంచి వేల కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com