Revanth Reddy: అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ నుంచి రేవంత్ విడుదల..

Revanth Reddy (tv5news.in)
Revanth Reddy: తెలంగాణ రైతుల్ని బీజేపీ,టీఆర్ఎస్ లు కలిసి మోసం చేస్తున్నాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన రేవంత్.. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రచ్చబండ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వరేస్తే ఉరన్న కేసీఆర్.. ఫాం హౌజ్ లోని 150 ఎకరాల్లో వరేశాడన్నారు. రైతులు కూడా యాసంగిలో వడ్లు పండించాలని.. ప్రభుత్వం మెడలు వంచి తాము కొనిపిస్తామన్నారు.
కేసీఆర్ వడ్లు కొనేటోడే, రైతుల వడ్లూ కొంటాడన్నారు. రైతుల వడ్లు కొనకుంటే కేసీఆర్ కే ఉరేస్తమని హెచ్చరించారు రేవంత్. వరి సమస్యను పక్కదారి పట్టించేందుకే బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు దిగారన్నారు రేవంత్. వరిపై చర్చ లేకుండా చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలను జనం గమనించాలన్నారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు మోడీ, కేసీఆరే కారణమన్నారు రేవంత్.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఇవాళ రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో ఆయన్ని అక్కడికి వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచే రేవంత్ ఇంటివద్ద హై డ్రామా నడిచింది. భారీగా మోహరించిన పోలీసులు.. రేవంత్ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రవెల్లికి వెళ్లితీరుతానని రేవంత్ భీష్మించారు. రేవంత్ కు మద్దతుగా భారీగా నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రేవంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం విడిచిపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com