PCC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి..!
PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. రాష్ట్ర వ్యహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్, తాజా మాజీ PCC చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, CLP నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు మధుయాష్కీ, మల్లు రవి సహా సీనియర్లంతా తరలివచ్చారు. నాగం జనార్థన్‌రెడ్డి కూడా ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ పక్కన కనిపించడం విశేషం. రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకారానికి ముందు వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు. పెద్దమ్మగుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌కు దారి పొడవునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
కొత్త PCC చీఫ్ రేవంత్‌రెడ్డికి పార్టీ నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ను అధ్యక్షుడి సీట్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఉత్తమ్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తూ రేవంత్ సంతకం చేశారు. బాధ్యతల స్వీకార ఘట్టం పూర్తికాగానే అంతా గాంధీభవన్ నుంచి ఇందిరాభవన్‌కి వెళ్లారు. అక్కడ జరిగే సభలో కాసేపట్లో రేవంత్ సహా ముఖ్యనేతల ప్రసంగాలు ఉండనున్నాయి.
ఎటు చూసినా వేల మంది కార్యకర్తల కోలాహలం. బైక్‌లు, కార్లతో భారీ ర్యాలీలు. ఇదీ ఇవాళ PCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా హైదరాబాద్‌లో కనిపించిన దృశ్యం. జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లి దర్శనం తర్వాత మొదలైన ర్యాలీ పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్ మీదుగా మల్లేపల్లి నుంచి నాంపల్లి చేరడానికి 3 గంటలకు పైగా పట్టింది. ఈ దూరం 10 కిలోమీటర్ల లోపే అయినా పోటెత్తిన అభిమానుల సందోహం కారణంగా యాత్ర నెమ్మదిగా సాగింది.
ఐతే.. మల్లేపల్లి దగ్గరకు వచ్చేసరికి కార్యకర్తలు, అభిమానుల తాకిడి మరింత పెరగడంతో ర్యాలీ ముందుకు సాగడానికి చాలా ఆలస్యమయ్యే అవకాశం కనిపించింది. దీంతో రేవంత్‌రెడ్డి కార్ దిగారు. బైక్ మీద గాంధీభవన్‌కు చేరుకున్నారు. ముహూర్తం ప్రకారం బాధ్యతల స్వీకారం పూర్తి చేసేందుకు ఆయన బైక్‌పై వెళ్లారు. పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com