బీఆర్ఎస్ అడ్డా మెదక్ పై ఫోకస్.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

మెదక్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కు అడ్డాగా, గులాబీ కంచుకోటగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం కేసీఆర్ టీమ్ కు అలవాటు. సిద్ధిపేటలో హరీశ్ రావుకు వచ్చే రికార్డు మెజారిటీ.. మెదక్ పై బీఆర్ఎస్ కు ఉన్న పట్టును చెప్పకనే చెబుతుంది. ఆ నియోజకవర్గాన్ని బద్దలుకొడితే కేసీఆర్ పనైపోయినట్లేనని భావిస్తున్న రేవంత్.. అదే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు.
బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో చాపకింద నీరులా కాంగ్రెస్ ను విస్తరింప చేస్తున్నారు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్. మెదక్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందరి మెజార్టీలు కలిపితే రెండు లక్షలపైనే ఉంది. మెదక్ ఎంపీ పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,16,427 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. గతంలోనూ కేసీఆర్, విజయశాంతి, ఆలె నరేంద్ర గులాబీ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలిచారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో కొత్త అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం మైనంపల్లి హనుమంతరావును దింపాలనే ఆలోచన చేస్తోంది. సిద్దిపేటలో ఇప్పటికే భారీ సమావేశం నిర్వహించారు హనుమంతరావు. ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో పట్టు సాధించేలా హన్మంత రావు స్కెచ్ వేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరిన పాత వాళ్లందర్ని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. నీలం మధు చేరికతో పటాన్ చెరులో కాంగ్రెస్ బలోపేతం అయింది. ఐతే.. ఈసారి మెదక్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కు అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com